శనివారం10 అక్టోబర్ 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో పోలీసుల భారీ ఆపరేషన్‌.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో 21.499 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు మహిళల అరెస్ట్‌..

nagendra10 October 2026, 2:51 AM19 చూసులుtrinetnews.com
మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో పోలీసుల భారీ ఆపరేషన్‌.. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ లో 21.499 కిలోల గంజాయి పట్టివేత.. ఇద్దరు మహిళల అరెస్ట్‌..

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

సికింద్రాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్‌ 9 :

మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు రెండు వేర్వేరు కేసుల్లో భారీగా గంజాయి, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్ లోని మల్కాజ్గిరి డిసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజ్గిరి డిసిపి శ్రీధర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ కార్‌ పార్కింగ్‌ ప్రాంతంలో 21 కిలోల 499 గ్రాముల గంజాయిని తరలిస్తున్న ఇద్దరు మహిళలను గోపాలపురం పోలీసులు, ఎస్‌ఓటీ మల్కాజిగిరి బృందం సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. మరోవైపు, షామీర్‌పేట-కీసర రహదారిపై అక్రమంగా పేలుడు పదార్థాలను తరలించి విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురిని కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మొదటి కేసులో మహారాష్ట్రలోని ముంబైకి చెందిన లక్ష్మీ శంకర్‌ నటేకర్‌ (58), జయ అలీముల్లా సర్దార్‌ (59) నుంచి రూ.6.30 లక్షల విలువైన గంజాయి, రెండు మొబైల్‌ ఫోన్లు, రూ.3,500 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన నాగేశ్‌ నుంచి గంజాయి తీసుకున్న నిందితులు, దానిని ముంబైకి చెందిన గంగూబాయికి అందజేసేందుకు రైలులో వెళ్లాలని భావించినట్లు విచారణలో వెల్లడైంది. ముంబైకి వెళ్లే రైలు అందుబాటులో లేకపోవడంతో స్టేషన్‌ కార్‌ పార్కింగ్‌ ప్రాంతంలో వేచి ఉండగా పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ ఘటనపై ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద కేసు నమోదు చేసి, గంజాయి సరఫరాలో ఇతరుల పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు.

రెండో కేసులో అక్టోబర్‌ 8న అందిన విశ్వసనీయ సమాచారం మేరకు కీసర పోలీసులు షామీర్‌పేట–కీసర రహదారిపై వీఆర్‌ఆర్‌ వెంచర్‌ సమీపంలో తనిఖీలు నిర్వహించి ముగ్గురిని పట్టుకున్నారు. విచారణలో రీజెనెసిస్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నుంచి 230 డిటోనేటర్లు, ఆర్‌కేడీ క్రషర్‌ యూనిట్‌ నుంచి 28 జిలెటిన్‌ స్టిక్స్‌ దొంగిలించినట్లు నిందితులు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. క్రషర్‌ నిర్వాహకులకు అధిక ధరలకు విక్రయించి అక్రమంగా లాభాలు పొందేందుకు పథకం వేసినట్లు గుర్తించారు. ఈ కేసులో మరో నిందితుడు రాజును అక్టోబర్‌ 9న అరెస్ట్‌ చేశారు. మొత్తం 230 డిటోనేటర్లు, 28 జిలెటిన్‌ స్టిక్స్‌, మూడు మొబైల్‌ ఫోన్లు, ఏపీ 24 ఏడబ్ల్యూ 7208 నంబరు గల హీరో ప్యాషన్‌ ప్రో బైక్‌ ను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు పదార్థాల చట్టం, బీఎన్‌ఎస్‌ నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి, నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచేందుకు చర్యలు చేపట్టారు.

మల్కాజిగిరి జోన్‌ డీసీపీ శ్రీధర్‌, ఎస్‌ఓటీ డీసీపీ, సంబంధిత ఏసీపీలు, గోపాలపురం పోలీస్‌ అధికారులు, ఎస్‌ఓటీ బృందాల పర్యవేక్షణలో ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గోపాలపురం కేసులో ఎస్‌ఐ రవి నాయక్‌, సిబ్బంది పనితీరును మల్కాజిగిరి ఏసీపీ అభినందించారు.

ఇవి కూడా చదవండి