Saturday10 October 2026Vijayawada

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
Languages

Latest News

స్వచ్ఛతా హి సేవలో లక్ష్యానికి మించి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 4,710 కార్యక్రమాలు.. 74,483 మంది భాగస్వామ్యం

nagendra9 October 2026, 2:33 AM3 viewstrinetnews.com
స్వచ్ఛతా హి సేవలో లక్ష్యానికి మించి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా 4,710 కార్యక్రమాలు.. 74,483 మంది భాగస్వామ్యం

Share this story

Share link keeps your language (?lang=)

న్యూ ఢిల్లీ, అక్టోబర్‌ 8, ట్రైనెట్ న్యూస్:

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ‘స్వచ్ఛతా హి సేవ–2026’ ప్రచారాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 2 వరకు నిర్వహించిన ఈ ప్రచారంలో మంత్రిత్వ శాఖ, దాని మీడియా విభాగాలు, క్షేత్రస్థాయి కార్యాలయాలు దేశవ్యాప్తంగా 4,710 కార్యక్రమాలను చేపట్టాయి. నిర్దేశించిన 2,943 కార్యక్రమాల లక్ష్యంలో 160 శాతం సాధించాయి. మొత్తం 74,483 మంది పాల్గొన్నారు.

‘స్వచ్ఛతలో అందరి భాగస్వామ్యం.. స్వచ్ఛ భారత్‌, వికసిత భారత్‌’ ఇతివృత్తంతో నిర్వహించిన ప్రచారం అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌ దివస్‌తో ముగిసింది. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు–2026పై అవగాహన కల్పించడం, యువత భాగస్వామ్యాన్ని పెంచడం, పరిశుభ్రతను సమష్టి బాధ్యతగా ప్రోత్సహించడం ప్రధాన లక్ష్యాలుగా కార్యక్రమాలు సాగాయి.

ప్రచారంలో భాగంగా అక్టోబర్‌ 1న సమాచార–ప్రసార, రైల్వే, ఎలక్ట్రానిక్స్‌–ఐటీ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మాట్లాడారు. పరిశుభ్రత రోజువారీ జీవితం, పనిలో శాశ్వత అలవాటుగా మారాలని సూచించారు. ప్రతి కార్యాలయానికి, చిన్న క్షేత్రస్థాయి విభాగానికీ స్వచ్ఛత సందేశం చేరాలని కోరారు.

కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్‌ ఎల్‌. మురుగన్‌ ఢిల్లీలోని భారతీయ జనసంచార సంస్థలో ‘ఏక్‌ దిన్‌, ఏక్‌ ఘంటా, ఏక్‌ సాథ్‌’ కార్యక్రమంతో పాటు ఇతర స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పరిశుభ్రతను ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

ప్రచారంలో భాగంగా పరిశుభ్రత అవసరమైన ప్రదేశాలను గుర్తించి, నిర్ణీత సమయంలో శుభ్రపరిచారు. ఈ విభాగంలో 2,864 కార్యక్రమాల ద్వారా నిర్దేశిత ప్రదేశాలను మెరుగుపరచడంతో పాటు రద్దీగా ఉండే ప్రజా ప్రదేశాలను శుభ్రం చేశారు. ‘స్వచ్ఛ పాఠశాల–యువ ఫర్‌ స్వచ్ఛత’ కింద 219 కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులు, యువతకు వ్యర్థాల నిర్వహణ కేంద్రాల సందర్శనలు, చర్చలు, అవగాహన యాత్రల ద్వారా పరిశుభ్రత, వర్షపు నీటి సంరక్షణ, నీటి నిర్వహణపై అవగాహన కల్పించారు.

పారిశుధ్య కార్మికుల భద్రత, గౌరవం కోసం 139 కార్యక్రమాలు చేపట్టారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, వ్యక్తిగత రక్షణ పరికరాలు పంపిణీ చేయడం, అర్హులకు కేంద్ర–రాష్ట్ర సంక్షేమ పథకాలతో అనుసంధానం కల్పించడం వంటి సేవలు అందించారు. పరిశుభ్రతకు వారు చేస్తున్న కృషిని గుర్తిస్తూ స్థానికంగా సత్కరించారు.

ప్రజల భాగస్వామ్యం విభాగంలో 1,418 కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటింటి అవగాహన ప్రచారం, వ్యర్థాలను ఉత్పత్తి స్థాయిలోనే నాలుగు వర్గాలుగా వేరు చేయడం, కంపోస్టింగ్‌, స్వచ్ఛత కోసం క్రీడలు, ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ కింద మొక్కలు నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టారు.

‘స్వచ్ఛతతో సమృద్ధి’ కింద 70 కార్యక్రమాల ద్వారా వ్యర్థాలతో ఉపయోగకర వస్తువులు, కళాఖండాల తయారీని ప్రోత్సహించారు. పాత పుస్తకాలు, బొమ్మలు, దుస్తుల సేకరణ–విరాళ కార్యక్రమాలు కూడా నిర్వహించారు.

సెప్టెంబర్‌ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం, అక్టోబర్‌ 1న గంటపాటు స్వచ్ఛంద పరిశుభ్రత సేవ, అక్టోబర్‌ 2న స్వచ్ఛ భారత్‌ దివస్‌ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అధికారులు, సిబ్బంది, యువత, పారిశుధ్య కార్మికులు, పౌరుల భాగస్వామ్యంతో స్వచ్ఛతను నిరంతర ప్రజా ఉద్యమంగా కొనసాగించేందుకు కట్టుబడి ఉన్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.

Also read

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

Read more →