Saturday10 October 2026Vijayawada

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
Languages

Latest News

ప్రతీ పరిచయం అభిమానంగా మారకపోవచ్చు.

nagendra9 October 2026, 2:31 AM2 viewstrinetnews.com
ప్రతీ పరిచయం అభిమానంగా మారకపోవచ్చు.

Share this story

Share link keeps your language (?lang=)

ఎన్నో ఏళ్ల కల. తన చదువుల కోసం కష్టార్జితాన్నంత పణంగా పెట్టిన తన తండ్రి కోసం ఒక పెద్ద సొంత ఇంటిని నిర్మించాలని తను కన్న కలలు నెరవేరే రోజు. ఎంతో సంతోషంతో గృహప్రవేశం జరుగుతున్న ఆ రోజు బంధువులతో సందడిగా ఉంది. స్నేహితుల అభినందనలు, బంధువుల పలకరింపులు, వాయిద్యాల శబ్దాలతో కొత్త ఇల్లంతా మారుమోగిపోతుంది. ఇంతలో దగ్గరి బంధువు ఒకరు ఇలా అంటున్నాడు. "కిటికీలలో టేకు కర్ర కాకుండా నాసిరకం కర్ర ఉపయోగించారు. నీటి పైపులు ఏవీ కూడా సరిగ్గా బిగించబడలేదు. తలుపులు కూడా అంత దృఢంగా లేవు. వాస్తు ప్రకారం ఉండాల్సినవి ఏవీ సరిగ్గా లేవు. మీరు నిర్మాణానికి చెల్లించిన పైసలకు నిజంగా న్యాయం జరిగిందా?" అని అడిగేసరికి ఒక్కసారిగా ఆ సంతోషమంతా ఆవిరైంది.

చిన్ననాటి నుండి తనతో కలిసి చదువుకున్న మిత్రుడికే ఇంటి నిర్మాణం అప్పగిస్తే ఇంటిని నాణ్యతగా నిర్మిస్తాడని నమ్మాడు. ఆ నమ్మకంతోనే ఎటువంటి ఒప్పంద పత్రం రాసుకోలేదు. ఏ బ్యాంకులో ఎంత లోన్ తీసుకున్నాడో , ఇల్లు కట్టే సమయంలో డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడ్డాడో తను ప్రత్యక్షంగా చూశాడు. అయినప్పటికీ ఎన్నో ఏళ్ల అతని కల అయిన ఆ ఇంటిని ఇలా నాణ్యత లేకుండా నిర్మించి ఇస్తాడని తెలుసుకోలేకపోయాడు.

ఇక్కడ "ఎప్పటి నుండో తెలిసిన వ్యక్తే కదా" అని గుడ్డిగా నమ్మడం అతని తప్పే..ముమ్మాటికీ అతని తప్పే..

మనిషి సంఘజీవి. ఎంత ఆస్తి ఉన్నా, ఎన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉన్నా జీవితాంతం ఒంటరిగా బ్రతకలేడు. చుట్టూ ఉండే మనుషులతో కలిసి బ్రతకాల్సిందే.

అయితే చుట్టూ ఉండే మనుషులందరూ ఒకే ఆర్థిక, సాంఘిక పరిస్థితుల్లో పెరిగినవారు కాకపోయి ఉండొచ్చు. కాబట్టి ఒక్కొక్కరు ఒక్కో రకమైన మనస్తత్వంతో ఉంటారు.

ఇన్ని రోజులు నాతో కలిసే ఉన్నాడు, ఇప్పుడు ఇలా చేస్తాడని అనుకోలేదు అని బాధపడినా ఏం లాభం? నువ్వుండే ప్రాంతానికి ఓ మూడు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలోనో ,ప్రక్క రాష్ట్రంలోనో, పక్క దేశంలోనో ఉండే వ్యక్తికి అసలు నీ పేరే తెలియకపోవచ్చు, అలాంటప్పుడు నీ మీద అసూయ గాని, కోపం గానీ ఎందుకుంటుంది?

కేవలం నీ గురించి తెలిసిన వాళ్ళలోనో, ప్రత్యక్షంగా నిన్ను చూసేవాళ్ళలోనో, నీ మాటల వల్లనో, చేతల వల్లనో బాధపడిన వాళ్ళలోనే నీ మీద అసూయగానీ, కోపంగానీ ఉండొచ్చు .

ఎదుటి మనుషులందరూ మనం ఆలోచించినట్టే ఆలోచిస్తూ, మనలాగే ప్రవర్తిస్తారు అనుకోవడం మన మూర్ఖత్వమే. "నా మనుషులు" అని అనుకొని అన్నీ వాళ్ళతో నువ్వు పంచుకోవచ్చు, వాళ్లకోసం ఏం చేయడానికైనా సిద్ధ పడొచ్చు . కానీ వాళ్లు తిరిగి నీపై అంతే అభిమానం, ప్రేమ చూపిస్తారని ఆశించకు. నువ్వు ఎదుటి వాళ్లకి ఎంత ప్రేమ, అభిమానం, సంతోషం పంచినా కూడా ఎదుటి వాళ్ళ దగ్గర ఏది ఉంటే అదే నీకు ఇవ్వగలరు. వాళ్లకోసం నువ్వు సముద్రాలు దాటినా సరే వాళ్ళు నీకోసం ఒక చిన్న కాలువ కూడా దాటలేకపోవచ్చు. అందుకే ప్రతీ పరిచయం నీకు అభిమానాన్నే ఇస్తుందని భ్రమ పడకు.

ఒక చలివేంద్రం దగ్గర నీళ్లు తాగే వ్యక్తి "తనకు నీళ్లు పోయడం అనేది ఎదుటి వ్యక్తి యొక్క బాధ్యత" అన్నట్టుగా భావిస్తాడు. నీళ్లు త్రాగడం తన హక్కు అన్నట్టుగా ఆలోచిస్తాడు. అదే పది రూపాయలకు వాటర్ బాటిల్ అమ్మే వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు ఈ "హక్కు- బాధ్యత" అంటూ ఇలాంటి ఆలోచన రాదు. ఎందుకంటే చలివేంద్రం దగ్గర ఉచితంగా దొరుకుతుంది కాబట్టి. ఎదుటి వాళ్లు అడగకుండానే సహాయం చేయడానికి ముందుకు వస్తారు కాబట్టి. అలాగే ఎదుటి వ్యక్తి నిన్ను అడగకపోయినా, అతిగా సాయం చేయాలని, తాపత్రయపడి, ఎల్లవేళలా వారికి అందుబాటులో ఉండి , అన్ని పనులకి నువ్వే ముందు పడి వారి దృష్టిలో నీ విలువ కోల్పోకు. చుట్టూ ఉండే మనుషుల్లో నిన్ను వాడుకునే వాళ్ళు, నీతో ఆడుకునే వాళ్లు కూడా ఉంటారు. అది గమనించకపోవడం మన తప్పే..

"చివరిగా ఒక్క మాట.:"నిజంగా నీ ఆలోచనలను అర్థం చేసుకునే వారెవరో, కష్టసమయాల్లో నీకు తోడుగా నిలబడేవారేవారో పూర్తిగా అర్థం చేసుకోకుండా ఎవరితోనూ అతిగా భావోద్వేగ సాన్నిహిత్యం పెంచుకోకు. నీతో కలిసి ఉండటం వేరు, కలిసి బ్రతకడం వేరు. జీవితంలో కొన్ని సందర్భాలు నిన్ను బాధ పెట్టి అయినా సరే నిజంగా ఎవరు నీ వాళ్ళో తెలిసేలా చేస్తాయి. అందరితోనూ కలిసే ఉండు. అందరి మాటలూ విను. వారి ప్రవర్తనను గమనించు. మాటలకి, చేతలకీ ఎంత తేడా ఉందో సరిగ్గా అర్ధం చేసుకో. నీకోసం అందరూ నిలబడతారని గుడ్డిగా నమ్మకు. అవసరం అయితే ఒంటరిగానే పోరాడటానికి సిద్ధంగా ఉండు కానీ గుడ్డినమ్మకంతో మోసపోయి జీవితాంతం మనసులో బాధ నింపుకోకు.

M. Jaya Krishna Reddy

M.S. (Counselling & Psychotherapy)

Motivational Speaker

Cell: 9640 21 55 41

Also read

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

Read more →