అరణ్యభవన్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష
హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9:
సింథటిక్ మాంజా విక్రయాలు, వినియోగాన్ని అరికట్టడంతో పాటు పాలపిట్టలు, ఇతర వన్యప్రాణుల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని అటవీ దళాల అధిపతి వినయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. నిషేధిత సింథటిక్ మాంజా విక్రయించే దుకాణాల లైసెన్సుల రద్దుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశాలపై శుక్రవారం అరణ్యభవన్‌లో వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహిస్తున్న సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు.
విక్రయాలపై ప్రత్యేక నిఘా
సింథటిక్ మాంజా ఇతర రాష్ట్రాల నుంచి సరఫరా అవుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా రాజస్థాన్, గుజరాత్ నుంచి వచ్చే సరఫరాలపై నిఘా పెంచాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ అధికారులు దుకాణాల యజమానులకు సింథటిక్ మాంజా విక్రయించరాదని ఆదేశాలు జారీ చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఈ-కామర్స్ సైట్లపైనా నిఘా
ఆన్‌లైన్ వేదికల ద్వారా చైనా మాంజా విక్రయాలు జరగకుండా పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో సింథటిక్ మాంజా విక్రయాలను గుర్తించి, వాటిని అరికట్టేందుకు సంబంధిత సంస్థలతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. సింథటిక్ మాంజా నిషేధంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ఇతర రద్దీ ప్రాంతాలు సహా అన్ని బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
విద్యార్థులకు అవగాహన కల్పించాలి
చైనా మాంజా వినియోగం వల్ల మనుషులు, పక్షులకు కలిగే ప్రమాదాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు పాఠశాల విద్యాశాఖ అవగాహన కల్పించాలని తెలిపారు. బస్సుల్లో సింథటిక్ మాంజా అక్రమ రవాణా లేదా పాలపిట్టలు, ఇతర వన్యప్రాణుల తరలింపును గుర్తిస్తే అటవీ శాఖ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించేలా బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు సూచనలు ఇవ్వాలన్నారు.
కైట్ ఫెస్టివల్‌లో అనుమతించొద్దు
పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కైట్ ఫెస్టివల్‌లో చైనా మాంజా వినియోగంపై స్వచ్ఛంద సంస్థల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయని సమావేశంలో ప్రస్తావించారు. ఈసారి ఉత్సవాల్లో సింథటిక్ మాంజాను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని, గుర్తించిన వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు.
పాలపిట్టలను పంజరాల్లో ఉంచొద్దు
దుర్గా మండపాల వద్ద పాలపిట్టలను పంజరాల్లో ఉంచి ప్రదర్శించకుండా చర్యలు తీసుకోవాలని వినయ్‌కుమార్ ఆదేశించారు. దేవాదాయ శాఖ అధికారులు అన్ని దేవాలయాల వద్ద ఈ ఆదేశాలు అమలయ్యేలా చూడాలని పేర్కొన్నారు. వన్యప్రాణుల రక్షణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ సమావేశంలో సీసీఎఫ్ లు ప్రియాంక వర్గీస్, క్షితిజ, సీఎఫ్ ప్రసాద్ పోలీసు, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, పాఠశాల విద్య, సినిమాటోగ్రఫీ, సమాచార ప్రసార, విద్యుత్తు, కాలుష్య నియంత్రణ మండలి, పర్యాటక శాఖలతో పాటు ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.





