Saturday10 October 2026Hyderabad

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
HYD 22K₹1,40,030/10g+1.43%
Languages

Latest News

ప్రజాస్వామ్యానికి హృదయ స్పందన- సమాచార హక్కు చట్టం.

nagendra10 October 2026, 2:38 AM2 viewstrinetnews.com
ప్రజాస్వామ్యానికి హృదయ స్పందన- సమాచార హక్కు చట్టం.

Share this story

Share link keeps your language (?lang=)

సమాచార దర్పణం బ్రోచర్ ఆవిష్కరణ

రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాముందస్తు సమాచార వెల్లడి, సకాలంలో సమాధానాలు, పౌర కేంద్రిత పాలనతో ప్రజల్లో విశ్వాసం మరింత బలోపేతం

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9:

సమాచార హక్కు చట్టం కేవలం ఒక చట్టం మాత్రమే కాదని, అది మన ప్రజాస్వామ్యానికి హృదయ స్పందన వంటిదని, పారదర్శకత, జవాబుదారీతనం, పాలనలో ప్రజల భాగస్వామ్యానికి బలమైన పునాది అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా పేర్కొన్నారు.

అక్టోబర్ 5 - 12వ తేదీ వరకు నిర్వహిస్తున్న సమాచార హక్కు వారోత్సవాలు 2026లో భాగంగా శుక్రవారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో తెలంగాణ సమాచార కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. సమాచార హక్కు చట్టం, 2005 అమలులోకి వచ్చి 21 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలంటే పాలన పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలని గవర్నర్ పేర్కొన్నారు. 2005లో అమలులోకి వచ్చిన చారిత్రాత్మక సమాచార హక్కు చట్టం ద్వారా సామాన్య పౌరులు పాలనా వ్యవస్థను ప్రశ్నించి, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని నేరుగా కోరే అధికారం పొందారని తెలిపారు. సమాచార హక్కు కింద దాఖలయ్యే ప్రతి దరఖాస్తు కేవలం ఒక కాగితం లేదా దరఖాస్తు మాత్రమే కాదని, దాని వెనుక ఒక సమస్య, హక్కుల కోసం విన్నపం లేదా న్యాయం కోసం చేసే ప్రయత్నం ఉంటుందని గవర్నర్ పేర్కొన్నారు.

అందువల్ల ఈ చట్టం విజయాన్ని కేవలం దరఖాస్తులు, అప్పీళ్ల పరిష్కార సంఖ్యతోనే కాకుండా, పరిపాలనా విధానాల్లో తీసుకువచ్చే శాశ్వతమైన, పారదర్శకమైన మార్పులతో అంచనా వేయాలని సూచించారు.

సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(బి) కింద ముందస్తు సమాచార వెల్లడి అత్యంత కీలకమని, అది ఈ చట్టానికి ఆత్మ వంటిదని గవర్నర్ అభివర్ణించారు.

ప్రభుత్వ పథకాలు, విధానాలు, అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండటంతో పాటు, నిరంతరం ప్రచారం చేయాలని సూచించారు. తద్వారా అవసరమైన సమాచారం కోసం ప్రజలు సమాచార హక్కు దరఖాస్తులు దాఖలు చేయాల్సిన అవసరం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ వంటి వైవిధ్యభరితమైన రాష్ట్రంలో సమాచారాన్ని తెలుగుతో పాటు ప్రజలకు అర్థమయ్యే ఇతర భాషల్లోనూ అందుబాటులో ఉంచాలని గవర్నర్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళలు, దివ్యాంగులు, సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సమాచార హక్కు చేరేలా చూడటం అందరి సమష్టి బాధ్యత అని స్పష్టం చేశారు.

డిజిటల్ యుగంలో కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్), డేటా విశ్లేషణ, డిజిటల్ రికార్డుల నిర్వహణ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సురక్షితంగా, సమ్మిళిత పద్ధతిలో వినియోగించడం ద్వారా సమాచార వ్యవస్థలను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దవచ్చని గవర్నర్ పేర్కొన్నారు. ప్రజా సమాచార అధికారులు ప్రథమ అప్పీళ్ల అధికారులు ప్రతి దరఖాస్తును బాధ్యతగా పరిగణించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. నిర్ణీత గడువులోగా స్పష్టమైన, సముచిత కారణాలతో కూడిన సమాధానాలను నిష్పక్షపాతంగా, సున్నితత్వంతో అందించడం అత్యంత ప్రాధాన్యంగా ఉండాలని సూచించారు. అదే సమయంలో పరిపాలనా పారదర్శకతకు, పౌరుల వ్యక్తిగత గోప్యత హక్కులకు మధ్య సమతుల్యతను పాటించాలని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంపొందించడం, సరైన మార్గదర్శకత్వం అందించడం, సుపరిపాలనను బలోపేతం చేయడం కోసం తెలంగాణ సమాచార కమిషన్ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. ప్రతి పౌరుడు తన హక్కులను పూర్తి విశ్వాసంతో కోరగలిగేలా, ప్రతి ప్రభుత్వ సంస్థ బాధ్యతాయుతంగా, సున్నితత్వంతో విధులు నిర్వర్తించేలా పారదర్శకమైన, సాధికార తెలంగాణ నిర్మాణానికి అందరూ కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి సమాచార వెల్లడి, ప్రతి సకాలపు సమాధానం ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తెలంగాణ సమాచార కమిషన్ రూపొందించిన ‘సమాచార దర్పణం’ వార్తాపత్రికను ఆవిష్కరించారు. అనంతరం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీవీ ఆనంద్ సమాచార హక్కు ప్రతిజ్ఞ చేయించారు. సమాచార హక్కు చట్టం అమలులో విశేష కృషి చేసిన అధికారులు, విభాగాలకు గవర్నర్ అవార్డులు ప్రదానం చేసి సత్కరించారు.

సమాచార హక్కు అవార్డుల ప్రదానం

ఉత్తమ స్వచ్ఛంద సమాచార వెల్లడి విభాగంలో నల్గొండ కలెక్టర్ చంద్రశేఖర్, మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్ వినోద్ కుమార్, టీజీ జెన్‌కో సీఎండీ హరీష్ అవార్డులు అందుకున్నారు.

ఉత్తమ పనితీరు కనబరిచిన జిల్లా విభాగంలో భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్, సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అవార్డులు అందుకున్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన శాఖాధిపతి విభాగంలో గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ దివ్య దేవరాజన్ అవార్డు అందుకున్నారు.

ఉత్తమ పనితీరు కనబరిచిన సచివాలయ శాఖ విభాగంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అవార్డు అందుకున్నారు.

ఉత్తమ ప్రజా సమాచార అధికారి విభాగంలో ఖమ్మం జిల్లా రెవెన్యూ అధికారి రామమూర్తి, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ నసీర్, మహబూబ్‌నగర్ జిల్లా విద్యాశాఖ అధికారి విజయకుమారి అవార్డులు అందుకున్నారు. ప్రత్యేక విభాగంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి, రామగుండం తహసీల్దార్ రవీందర్ అవార్డులు అందుకున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, కేవలం 15 నెలల్లో 30 వేల కేసులకు గాను 21 వేల కేసులను కమిషన్ పరిష్కరించిందని తెలిపారు. 24 శాఖల్లో పెండెన్సీని దాదాపు సున్నా స్థాయికి తీసుకువచ్చామని, ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఆడిట్ ప్రక్రియను పూర్తి చేశామని పేర్కొన్నారు.

2014 నుంచి 2023 వరకు పదేళ్ల వార్షిక నివేదికలను డిజిటల్ సాఫ్ట్ కాపీల రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టడం ద్వారా దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నివేదికల సమస్యను పరిష్కరించామని తెలిపారు. 2024, 2025 సంవత్సరాల నివేదికలను తదుపరి ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా కమిషన్ నూతన లోగో ఆవిష్కరణ, ‘సమాచార దర్పణం’ వార్తాపత్రిక ప్రారంభం, హైబ్రిడ్ విధానంలో వర్చువల్ విచారణల నిర్వహణ వంటి చర్యలతో సంస్థాగత ఆధునికీకరణకు ప్రాధాన్యతనిస్తున్నట్లు వివరించారు.

తక్షణ సమాచారాన్ని ఆశించే నేటి యువత, ముఖ్యంగా జెన్-జెడ్ అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వ విభాగాలు సమాచారాన్ని ముందుగానే ప్రజలకు అందించాలని ఆయన పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టంలోని సెక్షన్ 4(1)(బి) ప్రకారం తప్పనిసరిగా చేపట్టాల్సిన స్వచ్ఛంద సమాచార వెల్లడి, సమర్థవంతంగా పనిచేసే ఆన్‌లైన్ సమాచార హక్కు పోర్టల్ ద్వారా ప్రజలకు సమాచారం సులభంగా అందుబాటులోకి రావాలని సూచించారు.

ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్ పరిపాలన వంటి అధిక భారంతో పనిచేసే శాఖల్లో అనవసర వ్యాజ్యాలను తగ్గించడంతో పాటు, గ్రామీణ ప్రాంతాల ప్రజలు, మహిళల సమాచార హక్కు వినియోగంలో భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుభాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ డాక్టర్ జి. చంద్రశేఖర్ రెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ వినయ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బెన్‌హర్ మహేశ్ దత్ ఎక్కా, రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి. శ్రీనివాసరావు, మొహసినా పర్వీన్, దేశాల భూపాల్, వైష్ణవి మెర్ల, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ శాఖలకు చెందిన ప్రజా సమాచార అధికారులు, ప్రథమ అప్పీళ్ల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Also read

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

11 రోజులపాటు దీక్షలో కొనసాగనున్న కేంద్ర మంత్రి దసరా వరకు ఆలయంలో అమ్మవారి సేవలోనే తరించనున్న బండి సంజయ్

భవానీ మలాధారణ భక్తులతో సందడిగా మారిని మహాశక్తి ఆలయం ఆలయంలోనే ఉంటూ నవరాత్రి ఉత్సవాలను స్వయంగా పర్యవేక్షిస్తున్న కేంద్ర మంత్రి

Read more →