శనివారం10 అక్టోబర్ 2026హైదరాబాద్

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

ఉపాధి సృష్టికర్తలుగా యువత ఎదగాలి ఆహార ప్రాసెసింగ్ రంగంలో అపార అవకాశాలు: చిరాగ్ పాస్వాన్

nagendra10 October 2026, 2:48 AM4 చూసులుtrinetnews.com
ఉపాధి సృష్టికర్తలుగా యువత ఎదగాలి ఆహార ప్రాసెసింగ్ రంగంలో అపార అవకాశాలు: చిరాగ్ పాస్వాన్

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

న్యూ ఢిల్లీ, అక్టోబరు 9 (ట్రైనెట్ న్యూస్):

ఆహార ప్రాసెసింగ్ రంగంలో అపార అవకాశాలు ఉన్నాయని, యువత ఉద్యోగాల కోసం వెతికేవారిగా మాత్రమే కాకుండా ఉపాధి కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి చిరాగ్ పాస్వాన్ పిలుపునిచ్చారు. కుండ్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్‌ (నిఫ్టెమ్–కే) ఏడో స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో 260 మంది విద్యార్థులకు పట్టాలు, ప్రతిభ కనబరిచిన ఎనిమిది మందికి బంగారు పతకాలు అందజేశారు.

ఉద్యోగాల కల్పన, రైతుల ఆదాయ వృద్ధి, వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడింపు, ఆహార వృథా తగ్గింపులో ఈ రంగం కీలక పాత్ర పోషించగలదని మంత్రి అన్నారు. భారత్‌లో విస్తారమైన వ్యవసాయ వనరులు, పంటల వైవిధ్యం, భారీ వినియోగ మార్కెట్ ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుంటే ప్రపంచ ఆహార అవసరాలను తీర్చే ప్రధాన కేంద్రంగా దేశం ఎదగగలదని పేర్కొన్నారు. ప్రాసెసింగ్ సదుపాయాలు, సాంకేతికతను వ్యవసాయ క్షేత్రాలు, గ్రామీణ ప్రాంతాలకు చేరువ చేయాలని సూచించారు.

విద్యార్థులు సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యవస్థాపక నైపుణ్యాలతో కొత్త సవాళ్లకు పరిష్కారాలు కనుగొనాలని పాస్వాన్ కోరారు. రంగాన్ని బలోపేతం చేసే నూతన ఆలోచనలు, కార్యక్రమాలకు ప్రభుత్వం మద్దతు ఇస్తుందని తెలిపారు. ఆహార ఉత్పత్తుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. భారతీయ ఉత్పత్తుల నాణ్యత ఆయా సంస్థల ప్రతిష్ఠతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో ‘బ్రాండ్ ఇండియా’ గౌరవాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు.

ఆహార ప్రాసెసింగ్ శాఖ కార్యదర్శి అవినాశ్ జోషి మాట్లాడుతూ, పోషక విలువల పెంపు, జీవనోపాధి అవకాశాలు, ఆహార వృథా నియంత్రణకు ఈ రంగం తోడ్పడుతుందన్నారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులను తీర్చిదిద్దడంతోపాటు విస్తృత ప్రయోజనాలు అందించే పరిశోధనలను ప్రోత్సహించాలని సూచించారు.

విద్యార్థులు సంపాదించిన విజ్ఞానం, నైపుణ్యాలు దేశం, సమాజ పురోగతికి ఉపయోగపడాలని నిఫ్టెమ్–కే పాలక మండలి చైర్మన్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర అన్నారు. సురక్షితమైన, పోషక విలువలు కలిగిన ఆహారం, సుస్థిర ప్రాసెసింగ్, విలువ జోడింపులో భారత్ ప్రపంచ నాయకత్వం సాధించేలా వినూత్న ఆవిష్కరణలు అవసరమని పేర్కొన్నారు. విద్య, పరిశోధన, మౌలిక వసతులు, పరిశ్రమల భాగస్వామ్యాల్లో సంస్థ గణనీయ పురోగతి సాధించిందని డైరెక్టర్ డాక్టర్ హరిందర్ సింగ్ ఒబెరాయ్ తెలిపారు.

ఇవి కూడా చదవండి