శనివారం10 అక్టోబర్ 2026విజయవాడ

SENSEX72,472+0.12%
NIFTY22,520-0.16%
22K₹1,40,030/10g+1.43%
భాషలు

తాజా వార్తలు

యాంటీ డోపింగ్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం

క్రీడల్లో పారదర్శకత, నైతిక విలువలు, నిష్పక్షపాత పోటీలు అత్యంత కీలకం – -సాట్జీ వైస్ చైర్‌పర్సన్, ఎండీ డాక్టర్ ఎ. సోనిబాలా దేవి

nagendra10 October 2026, 2:49 AM6 చూసులుtrinetnews.com
యాంటీ డోపింగ్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం

ఈ వార్తను షేర్ చేయండి

లింక్‌లో మీ భాష (?lang=) జత అవుతుంది

హైదరాబాద్, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 9:

తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, క్రీడాకారులు, కోచ్‌లు, సాంకేతిక సిబ్బందికి యాంటీ డోపింగ్ నిబంధనలపై అవగాహన కల్పించే లక్ష్యంతో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ సహకారంతో శుక్రవారం గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో యాంటీ డోపింగ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. తెలంగాణలో జరగనున్న ప్రతిష్టాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్–2026, నేషనల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ తదితర ప్రధాన క్రీడా పోటీల నేపథ్యంలో క్రీడా సిబ్బందిని అన్ని విధాలుగా సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ కు చెందిన లీడ్ డోపింగ్ కంట్రోల్ ఆఫీసర్, యాంటీ డోపింగ్ ఎడ్యుకేటర్ డాక్టర్ నేహా సింగ్ పాల్గొని యాంటీ డోపింగ్ నిబంధనలపై సమగ్ర అవగాహన కల్పించారు. నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండాల్సిన ఆవశ్యకత, క్రీడాకారులు పాటించాల్సిన నియమ నిబంధనలు, డోపింగ్ ఉల్లంఘనలకు సంబంధించిన పరిణామాలను వివరించారు.

క్రీడల్లో న్యాయబద్ధమైన పోటీలు, పారదర్శకత, నైతిక విలువలు, క్రీడా స్ఫూర్తిని కాపాడుకోవాల్సిన ప్రాముఖ్యతను ఆమె వివరించారు. క్రీడాకారులు తమ ప్రతిభ, కృషి, క్రమశిక్షణతో విజయాలు సాధించాలని, నిషేధిత పదార్థాల వినియోగం వల్ల ఎదురయ్యే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు రవీందర్, శిరీష, స్టేడియం అడ్మినిస్ట్రేటర్లు రాజ్‌వీర్, రవికుమార్, స్వర్ణలత, సురేష్ కాలేరు తదితరులతో పాటు కోచ్‌లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఫిజియోథెరపిస్టులు, ఇతర క్రీడా సిబ్బంది పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాట్జ్ వైస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎ. సోనిబాలా దేవి మాట్లాడుతూ, తెలంగాణలో క్రీడారంగాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు, క్రీడల్లో నైతిక విలువలను పెంపొందించేందుకు సాట్జీ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. క్రీడాకారులు, కోచ్‌లు, సాంకేతిక నిపుణులకు అవసరమైన అవగాహన, నైపుణ్యాలను పెంపొందించడం ద్వారా స్వచ్ఛమైన, నిష్పక్షపాత క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడమే సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు.

ఇలాంటి అవగాహన కార్యక్రమాలు కోచ్‌లు, సాంకేతిక అధికారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, శారీరక విద్యా బోధకులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించేందుకు దోహదపడతాయని ఆమె తెలిపారు. రాష్ట్రంలో బలమైన, నైతిక విలువలతో కూడిన క్రీడా సంస్కృతిని నిర్మించేందుకు ఈ కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. రానున్న ప్రధాన క్రీడా పోటీలను వృత్తిపరమైన ప్రమాణాలతో, పూర్తి పారదర్శకతతో, నిర్దేశిత క్రీడా నియమ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు సాట్జ్ కట్టుబడి ఉందని సంస్థ స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి