న్యూఢిల్లీ, ట్రైనెట్ న్యూస్, అక్టోబర్ 13: సముద్ర నాచు సాగును విస్తరించి తీరప్రాంత ప్రజలకు సుస్థిర జీవనోపాధి అవకాశాలు కల్పించాలని కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలక్ష్ లిఖి సూచించారు. తమిళనాడులోని మండపం క్యాంప్ పరిధిలో ఉన్న మున్నైకాడు సముద్ర నాచు సాగు ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. స్వయం సహాయక సంఘాలకు చెందిన సాగుదారులతో మాట్లాడి, సాగు పద్ధతులు, నిర్వహణ, పంట సేకరణ ప్రక్రియలను పరిశీలించారు.
దేశంలో సముద్ర నాచు సాగును ప్రోత్సహించడం, తీరప్రాంత జీవనోపాధులను బలోపేతం చేయడం, ఉత్పత్తి నుంచి మార్కెటింగ్ వరకు విలువ గొలుసును అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ పర్యటన చేపట్టారు. సాంకేతికత వినియోగం, ఉత్పత్తులకు విలువ జోడించడం, స్థిరమైన ఉపాధి అవకాశాల కల్పనపై లిఖి దృష్టి సారించారు.
తమిళనాడులో అనుసరిస్తున్న మోనోలైన్ పద్ధతి, తెప్పల ఆధారిత సాగు విధానాలను రైతులు వివరించారు. సాగు, నిర్వహణ, పంట కోత పనులను ప్రదర్శించారు. సముద్ర నాచు సాగు ద్వారా సుస్థిర ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్న మహిళా స్వయం సహాయక సంఘాల కృషిని కార్యదర్శి అభినందించారు.
ఉత్పత్తిని పెంచడంతోపాటు మరింత మంది రైతులను సంఘటిత సాగులో భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన, ప్రధానమంత్రి మత్స్య కిసాన్ సమృద్ధి సహ యోజన తదితర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను వినియోగించుకోవాలని కోరారు.
పర్యటనకు ఒకరోజు ముందు మండపంలోని ఐసీఏఆర్–కేంద్ర సముద్ర మత్స్య పరిశోధనా సంస్థ ప్రాంతీయ కేంద్రంలో సముద్ర నాచు సాగుపై నిర్వహించిన సమావేశానికి లిఖి అధ్యక్షత వహించారు. సాగు కార్యక్రమాల పురోగతిని సమీక్షించి, ఉత్పత్తి విస్తరణ, విలువ జోడింపు, మార్కెట్ అనుసంధానాలను బలోపేతం చేసే చర్యలపై చర్చించారు.





